ప్రైవేట్ బోట్ల నిర్వాహకులకు వార్నింగ్
డబ్బులు ఎక్కువ వసూలు చేస్తే చర్య
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఓ వైపు వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్బంగా గత కొన్ని రోజులుగా ప్రైవేట్ బోట్లకు సంబంధించిన నిర్వాహకులు పెద్ద ఎత్తున డబ్బులను డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు సీఎం.
ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు బుధవారం మీడియాతో మాట్లాడారు. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకుంటున్నామని, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అన్నారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాలలో తల దాచుకున్నారని, వారికి ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు.
మానవతా దృక్ఫథంతో వ్యవహరించాల్సిన బోటు నిర్వాహకులు వరదను బూచిగా చూపి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జైలుకు పంపిస్తామని అన్నారు చంద్రబాబు నాయుడు.
అంతే కాకుండా కూరగాయలు, నిత్యావసర వస్తువులు అధిక ధరకి అమ్మితే, కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. రేపటి నుంచి ప్రభుత్వమే తక్కువ రేటుకి కూరగాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు సీఎం.