రామ్ చరణ్ రూ. కోటి విరాళం
ఏపీ..తెలంగాణకు రూ. 50 లక్షలు
హైదరాబాద్ – ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో భారీ ఎత్తున వర్షాలు కురవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల కోసం ప్రముఖ నటుడు రామ్ చరణ్ స్పందించారు. బుధవారం ఆయన కీలక ప్రకటన చేశారు. ఇరు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ. 50 లక్షల చొప్పున సాయం చేస్తున్నట్లు తెలిపారు.
ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. మరో వైపు తన తండ్రి , మెగా స్టార్ చిరంజీవి సైతం రూ. కోటి విరాళంగా ఇప్పటికే ప్రకటించారు. సినీ రంగానికి చెందిన మహేష్ బాబు ఇరు రాష్ట్రాలకు రూ. కోటి చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు.
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇరు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున కోటి రూపాయలు సాయం చేస్తున్నట్లు చెప్పారు. మరో నటుడు జూనియర్ ఎన్టీఆర్ రూ. కోటి ఇరు రాష్ట్రాల బాధితులకు సాయంగా ప్రకటించారు.
మాటల మాంత్రికుడు, దిగ్గజ దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 25 లక్షల చొప్పున రూ. 50 లక్షలు ప్రకటించారు. వీరితో పాటు విశ్వక్ సేన్ , జొన్నలగడ్డ సిద్దు, అనన్య నాగళ్ల సైతం తమ వంతు సాయం వెల్లడించారు.