బాధితులను ఆదుకుంటాం ఏపీని రక్షించుకుంటాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల
అమరావతి – ఆరు నూరైనా సరే అష్ట కష్టాలు పడి బాధితులను కాపాడుకుంటామని , అన్నీ కోల్పోయిన ఏపీ రాష్ట్రాన్ని రక్షించుకుంటామని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల.
తన వంతు బాధ్యతగా ఇప్పటి వరకు వరద బాధితులకు అండగా నిలిచేందుకు గాను రూ. 6 కోట్ల విరాళాన్ని ప్రకటించానని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టామని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రతిపక్షం బాధ్యతా యుతంగా వ్యవహరించాలే తప్పా బురద చల్లే ప్రయత్నం చేయకూడదంటూ హితవు పలికారు డిప్యూటీ సీఎం.
ఇప్పటి వరకు భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు తాను , మంత్రులు, ఉన్నతాధికారులంతా రేయింబవళ్లు బాధితులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు.
ఆహారం, పాలు, నీళ్ల ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. పలువురు ముందుకు వచ్చి విరాళాలు కూడా ఇస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో ఏపీలో దాదాపు 400కు పైగా గ్రామ పంచాయతీలు దారుణంగా దెబ్బ తిన్నాయని వాపోయారు. ఇందుకు గాను తన వంతుగా ఒక్కో పంచాయతీకి రూ. 1 లక్ష చొప్పున విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.