NEWSTELANGANA

ప్ర‌శ్నిస్తే అరెస్ట్ చేస్తారా..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఆర్ఎస్పీ

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణ డిజిట‌ల్ మీడియా మాజీ చీఫ్ కొణ‌తం దిలీప్ రెడ్డిని అకార‌ణంగా అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాల‌న గాడి త‌ప్పింద‌ని, రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు.

ట్విట్ట‌ర్ వేదిక‌గా శుక్ర‌వారం స్పందించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌స్తుతం వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ప్ర‌మాదంలో ప‌డ్డాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. దేశంలో కొలువు తీరిన న‌రేంద్ర మోడీ భారతీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం , రాష్ట్రంలో రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప్ర‌జాస్వామిక హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నారంటూ ఆరోపించారు.

ఇది ప్ర‌జాస్వామ్యానికి హెచ్చ‌రిక లాంటిద‌ని పేర్కొన్నారు. భార‌త రాజ్యాంగం ప్ర‌కారం ప్ర‌తి ఒక్క‌రికీ భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ ఉంద‌న్న విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. తామంతా ఒకే కుటుంబం అని త‌మ‌లో ఎవ‌రికి అన్యాయం జ‌రిగిన ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు.

కొణ‌తం దిలీప్ రెడ్డి అచ్చ‌మైన తెలంణ వాది అని, ఆయ‌న తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌మైన పాత్ర పోషించార‌ని అలాంటి వ్య‌క్తిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్ర‌శ్నించారు.