జిట్టా బాలకృష్ణా రెడ్డి ఇక లేరు
ఉద్యమకారుడిని కోల్పోయిన తెలంగాణ
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు , ఉద్యమ కారుడిగా గుర్తింపు పొందిన జిట్టా బాలకృష్ణా రెడ్డి శుక్రవారం తీవ్ర అస్వస్థతో కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి బ్రెయిన్ కు సంబంధించిన వ్యాధితో హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
దీంతో ఆయన భౌతిక కాయాన్ని ఇవాళ తన స్వంత స్వస్థలం నల్లగొండ జిల్లా భువనగిరికి తరలించారు. సాయంత్రం పట్టణ శివారులో ఉన్న ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు చేపట్టనున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు.
జిట్టా బాలకృష్ణా రెడ్డి ముందు నుంచీ తెలంగాణ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు. ఎన్నో ఉద్యమాలలో , పోరాటాలలో , ఆందోళనలలో పాల్గొన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియ చేయడంలో కీలక పాత్ర పోషించారు.
వివిధ సామాజిక మాధ్యమాలలో, సంఘాలతో కలిసి పని చేశారు. కీలక భూమిక పోషించిన జిట్టా బాలకృష్ణా రెడ్డి దూరం కావడం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటుగా పేర్కొంది భారత రాష్ట్ర సమితి పార్టీ. ప్రస్తుతం ఆయన అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. ఒక నిబద్దత కలిగిన ఉద్యమకారుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.