కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు..అఘాయిత్యాలు
మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న సబితా
హైదరాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి . శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రోజు రోజుకు బాలికలు, యువతులు, మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు సీఎం రేవంత్ రెడ్డికి మహిళల పట్ల గౌరవం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 8 నెలల కాలంలో ఏకంగా 1800 కు పైగా రేప్ లు, అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి.
రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లాయని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని ఆరోపించారు. మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
మహిళల పట్ల చులకన భావం ఉండడం సరి కాదన్నారు మాజీ మంత్రి. ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించక పోవడం దారుణమన్నారు.