సహాయక చర్యలపై పవన్ కళ్యాణ్ ఆరా
పారిశుధ్య నిర్వహణ పనులపై సమీక్ష
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద ముంపు ప్రాంతాల్లో సాగుతున్న సహాయక చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ పనులపై పంచాయతీరాజ్ శాఖ క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షించారు.
ముంపు ప్రభావంతో ఉన్న గ్రామాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు, ఇంజిరీనింగ్ విభాగం బృందాలుగా వెళ్ళి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం.
పారిశుద్ధ్య నిర్వహణ చేయడంతో పాటు ఎక్కడా నీరు నిలిచిపోకుండా చూడాలని స్పష్టం చేశారు. వీధుల్లో బ్లీచింగ్ చల్లించడంతో పాటు, డ్రైనేజీలు శుభ్రం చేసి నీరు నిలవకుండా చూసుకోవాలని సూచించారు.
తాగు నీటి సరఫరాలో క్లోరినేషన్ ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ప్రజారోగ్య విభాగంతోనూ సమన్వయం చేసుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు డిప్యూటీ సీఎం. ఇప్పటికే యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు పవన్ కళ్యాణ్.