టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్
సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో ఎంపిక
హైదరాబాద్ – కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి అత్యధికంగా పదవులు దక్కాయని పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తడంతో అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇచ్చింది.
రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితం అయింది. ఈ తరుణంలో పార్టీ చీఫ్ గా ఎంపిక కావడం కత్తి మీద సాము లాంటిది అని చెప్పక తప్పదు.
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. 24 ఫిబ్రవరి 1966లో పుట్టారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రహత్ నగర్ . ఎన్ఎస్ యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1986లో నిజామాబాద్ డీసీసీ చీఫ్ గా ఉన్నారు.
1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్ పల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకు ముందు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పని చేశారు.
నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడి పోయారు. పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పని చేశారు. 2018లో టికెట్ ఆశించిన ఆయనను కాదని మైనార్టీలకు కేటాయించింది పార్టీ. 2021లో పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. 2023లో టీపీసీసీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.