భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు
భక్తులకు కోరిన్నని లడ్డూలు
తిరుమల – తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు అందించేందుకు, కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుండి వెలువడనుందని, తద్వారా దర్శన, వసతి, శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను అరికట్టవచ్చని చెప్పారు.
తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు 29వ తేదీ నుంచి దర్శనం టోకెన్ లేని వారికి ఆధార్ తో లడ్డూలను అందించే విధానాన్ని టీటీడీ ప్రవేశ పెట్టిందన్నారు.
గత కొన్నేళ్లుగా పలువురు దళారులు లడ్డూలను బ్లాక్ మార్కెటింగ్ లో విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలిందన్నారు ఈవో. తిరుమలలో దళారి వ్యవస్థను అరికట్టి, స్వామి వారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టిందన్నారు.
ఇందులో భాగంగా, దర్శనం టోకెన్లు లేని వారికి ఆధార్ కార్డుపై రోజు వారి రెండు లడ్డూలను మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించిందని తెలిపారు.
చాలా కాలంగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, బయట ప్రాంతాలలో ఉన్న టీటీడీ ఆలయాలు, చెన్నై, బెంగళూరు, వెల్లూరులలోని టీటీడీ సమాచార కేంద్రాలలో లడ్డూల డిమాండ్ ఉన్నప్పటికి తాము పంపలే పోయినట్లు ఈవో తెలిపారు.
గత నాలుగు రోజుల్లో దాదాపు 75 వేల లడ్డూలు పంప బడ్డాయన్నారు. దీనిని శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
తిరుమలలో దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు, రూ.50/- ప్రాతిపదికన కోరినన్ని లడ్డూలు (స్టాక్ లభ్యత ఆధారంగా) అందజేస్తున్నామని తెలిపారు జె. శ్యామల రావు. దీనికి ఆధార్ కార్డు అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆవు నెయ్యి నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు లడ్డూ ప్రసాదాల నాణ్యతను పెంచేందుకు, సువాసన, రంగు, రుచి ఉండే నెయ్యి కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న టెండర్ షరతులను అనుసరించి నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. గతంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ పెట్టడం జరిగిందని తెలిపారు.
ముఖ్యంగా నెయ్యి నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు నెయ్యి కల్తీనా కాదా తెలుసుకునే దానికి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు టిటిడికి ఒక గ్యాస్ క్రోమాటో గ్రాఫ్ , హెచ్‌పిఎల్‌సిని విరాళం అందిస్తామని తెలిపారు. దీని ధర సుమారు రూ.80 లక్షల వరకు ఉంటుందన్నారు. వీటిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరుస్తారని తెలిపారు.
అన్నప్రసాదం నాణ్యతను మెరుగు పరిచేందుకు, ప్రస్తుతం ముడి సరుకుల సేకరణ ప్రక్రియను అధ్యయనం చేయడానికి నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే కమిటీ నివేదికను అందజేస్తుందని వెల్లడించారు.
అదేవిధంగా, శ్రీవారి అన్న ప్రసాదాల రుచిపై యాత్రికుల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, శ్రీవారి ఆలయంలో నైవేద్యాల కోసం సేకరిస్తున్న సేంద్రియ పదార్థాల నాణ్యతను తనిఖీ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ కమిటీ నివేదిక 15 రోజులలో వస్తుందన్నారు. నివేదికను అనుసరించి తదుపరి చర్యలు చేపడతామన్నారు.
కాలినడకన వచ్చే భక్తులకు అలిపిరి పాదాల మండపం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయు కౌంటర్లు , గాలి గోపురం వద్ద స్కానింగ్ కౌంటర్లను త్వరలో పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు జె. శ్యామల రావు.