DEVOTIONAL

అక్టోబర్ లో శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

Share it with your family & friends

4 నుంచి 12వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తామన్న ఈవో

తిరుమ‌ల – టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తిరుమ‌లలో వ‌చ్చే అక్టోబ‌ర్ నెల‌లో శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు జ‌రుగుతాని ఈవో తెలిపారు. ముఖ్యంగా అక్టోబర్ 8వ తేదీన‌ శ్రీవారి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

జూన్ నెల మొదటి వారంలో యాత్రికులకు వారానికి 1.05 లక్షల ఎస్ఎస్ డి టోకెన్లు ఇవ్వగా, ఇప్పుడు వారానికి 1.63 లక్షల టోకెన్‌లు జారీ చేస్తున్నామ‌ని చెప్పారు ఈవో జె. శ్యామ‌ల రావు. ఎస్ఎసడి టోకెన్స్ పెంచిన కారణంగా ఈ టోకెన్ పొందిన భక్తుల నిరీక్షించే సమయం గణనీయంగా తగ్గిందన్నారు.

నారాయణగిరి షెడ్ల వద్ద క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాదం, పారిశుద్ధ్యం, ఇతర ఏర్పాట్లు క్రమబద్ధీకరించి, వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను నియమించిన‌ట్లు తెలిపారు ఈవో.

అన్నప్రసాదం ట్రస్ట్‌ను మెరుగు పరచడానికి, బలోపేతం చేయడానికి కొన్ని స్వల్పకాలిక , దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ నిపుణుల కమిటీ సూచనల మేరకు తాము చర్యలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు ఈవో.

అన్నప్రసాద విభాగాన్ని ఆధునికరించడంతో పాటు అన్నప్రసాదాల పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు త్వరలో బెంగళూరుకు, హైదరాబాద్ కు చెందిన నిపుణులు తిరుమల లోని వివిధ అన్నప్రసాద కేంద్రాలను సందర్శించనున్నారు.

వీరందించే సూచనల మేరకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అన్న ప్రసాద విభాగాన్ని శాశ్వతంగా సంపూర్ణ స్థాయిలో ఆధునికరిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు జె. శ్యామ‌ల రావు.

తిరుమలలో 25.08.2024 నుండి 30.08.2024 వరకు శ్రీవారి ఆలయం, వసతి గృహాల సముదాయాలలో బొద్దింకలు మరియు ఎలుకల నిర్మూలన కోసం పెద్ద ఎత్తున స్టీపుల్ , హడ్సన్ బృందాలతో నిర్మూలన చర్యలు చేపట్టామ‌న్నారు. ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతుందన్నారు ఈవో.

శ్రీవారి భక్తుల నుదుటన పవిత్రమైన ”తిరునామం” ధారణ కార్యక్రమం, తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలలో ఈ రోజు నుండి పునః ప్రారంభిస్తున్నాం.

ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఏస్వో శ్రీధర్, సిఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.