NEWSTELANGANA

ఫిబ్ర‌వరిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్

Share it with your family & friends

మోదీ మూడోసారి పీఎం ఖాయం

హైద‌రాబాద్ – కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ గంగాపురం కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రిలోనే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ప్ర‌క‌టించ‌నుంద‌ని వెల్ల‌డించారు.

అయితే ఎప్ప‌టి లాగానే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో ఏప్రిల్ నెల మొద‌టి వారంలో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు కిష‌న్ రెడ్డి. గ‌తంలో కూడా ఇదే స‌మ‌యంలో జ‌నం ఓటు వేశార‌ని గుర్తు చేశారు .

ప్ర‌తిప‌క్షాలు ఎన్ని వ్యూహాలు ప‌న్నినా, ఎన్ని కుట్ర‌ల‌కు తెర లేపినా రాబోయేది భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌ర్కారేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఈ దేశంలోని 140 కోట్ల మంది ప్ర‌జ‌లు మూకుమ్మ‌డిగా సుస్థిర‌మైన పాల‌న‌ను, స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వాన్ని కోరుకుంటున్నార‌ని చెప్పారు.

ప్రపంచంలోనే అత్యున్న‌త‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ తిరిగి మూడోసారి ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరుతార‌ని , జ‌నం డిసైడ్ అయ్యార‌ని పేర్కొన్నారు గంగాపురం కిష‌న్ రెడ్డి.