అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం – మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరదలపై సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం అలర్ట్ చేయలేదన్నారు.
కావాలనే ప్రజల ప్రాణాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు. విజయవాడ వరదలు ఏ మాత్రం ప్రకృతి వైపరీత్యం కాదు
అది ప్రభుత్వం సృష్టించిన వైపరీత్యమని ఆరోపించారు గుడివాడ అమర్నాథ్.
చంద్రబాబు నాయుడు స్వంత ప్రచారంపై ఉన్నంత శ్రద్ద బాధితులను ఆదుకోవడంలో కనబర్చ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడను ముంచెత్తిన వరదల్లో చనిపోయిన వారివి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.
బుడమేరు వరదపై నీటి పారుదల శాఖ డీఈ, జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా.. భిన్న ప్రకటనలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నాయని మాజీ మంత్రి గుర్తు చేశారు.
విజయవాడలో వందలాది ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపాలు అందుబాటులో ఉన్నా, బాధితులను ఎందుకు తరలించలేక పోయారని ప్రశ్నించారు. వరద ముంచెత్తినప్పటి నుంచి రోజూ ఒక్కో విధంగా మందీ మార్బలంతో అట్టహాసంగా పర్యటిస్తూ.. పగలు, రాత్రి తేడా లేకుండా మీడియాతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, ఆ వరదలపై స్పష్టంగా ముందస్తు సమాచారం ఉన్నా, ప్రజలను ఎందుకు అలర్ట్ చేయలేదని అన్నారు.
గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో శబరి, గోదావరి నదులకు భారీ వరదలు వచ్చినప్పుడు సుమారు 250 ఏజెన్సీ గ్రామాలకు చెందిన 18 వేల కుటుంబాలను 102 పునరావాస కేంద్రాలకు తరలించామని మాజీ మంత్రి గుర్తు చేశారు.