DEVOTIONAL

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Share it with your family & friends

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో

తిరుప‌తి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో అమ్మ వారిని మేల్కొలిపి సహస్ర నామార్చ‌న, శుధ్ధి నిర్వహించారు. ఆనంతరం ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం తో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కార‌ణంగా క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌ను ర‌ద్దు చేశారు.

హైదరాబాదుకు చెందిన శ్రీ స్వర్ణ కుమార్ రెడ్డి అనే భ‌క్తుడు ఆలయానికి 11 పరదాలు విరాళంగా అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రమేష్, సూపరింటెండెంట్‌ శేష‌గిరి, అర్చ‌కులు బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు సుభాష్, గణేష్, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 16 నుండి 18వ‌ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబ‌రు 15న సాయంత్రం ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

సెప్టెంబ‌రు 16న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న మహా పూర్ణాహుతి చేప‌డ‌తారు.