సీఎం కామెంట్స్ హరీశ్ సీరియస్
యూట్యూబ్ ఛానళ్లు ఒక్కటవుతాయి
హైదరాబాద్ – యూట్యూబ్ ఛానళ్లపై నోరు పారేసుకున్న సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగిస్తున్న అక్రమాలను ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానళ్లు ఎండగడుతూ వస్తున్నాయని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.
దీనిని జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి స్థాయి మరిచి అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ మండిపడ్డారు. ప్రజా పాలన పేరుతో రాచరిక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని నిర్బంధాలు విధించినా, ఎన్ని కేసులు నమోదు చేసినా తెలంగాణ సమాజం భయపడదని, ఆ విషయం రేవంత్ రెడ్డి తెలుసుకుంటే మంచిదని స్పష్టం చేశారు తన్నీరు హరీశ్ రావు.
ప్రధానంగా ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వరదల్లో ఖమ్మం మునిగి పోతుంటే పట్టించుకోని సీఎం గురించి ప్రస్తావించినందుకు తట్టుకోలేక చిల్లర మాటలు మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు హరీశ్ రావు.
సీఎంను గద్దె దించేందుకు రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్లన్నీ ఒక్కటి అవుతాయని , నీ బండారన్ని బట్ట బయలు చేస్తాయని హెచ్చరించారు.