సీతారాం ఏచూరి ఇక లేరు
సెలవంటూ వెళ్లి పోయిన ప్రజా నేత
ఢిల్లీ – సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరు. సెప్టెంబర్ 12న గురువారం తుది శ్వాస విడిచారు. గత నెల ఆగస్టు 19న అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు సీతారాం ఏచూరి.
ఏచూరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ. ఆయన పూర్తి పేరు ఏచూరి సీతారామారావు. ఆగస్టు 12, 1952 లో తమిళనాడు రాజధాని చెన్నైలో పుట్టారు.
. 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న ఏచూరి.. ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ మోహన్ కందాకు మేనల్లుడు. సీతారం ఏచూరి వయసు 72 ఏళ్లు. ఇదిలా ఉండగా మృత దేహాన్ని ఎయిమ్స్ కు విరాళంగా ఇస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.
సీతారాం ఏచూరి మృతి పట్ల దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర సంతాపం తెలిపారు.
కాగా టీచింగ్, రీసెర్చ్ ప్రయోజనాల కోసం సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తన మృత దేహాన్ని దానం చేసినట్లు ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
భారత దేశ రాజకీయాలలో తనదైన ముద్ర కనబర్చారు. సంకీర్ణ రాజకీయాలకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చివరి శ్వాస వరకు మార్క్సిజం సూత్రాల పట్ల కట్టుబడి ఉన్నారు.
1974లో ఎస్ఎఫ్ఐ లో చేరారు. జేఎన్ యూ లో మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1984లో సీపీఎం కేంద్ర కమిటీకి ఎన్నికైన శాశ్వత ఆహ్వానితులయ్యారు. 30 ఏళ్లకు పైగా పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.
ఏచూరి 2005 నుండి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.