ఆధునిక సాంకేతికతను అంది పుచ్చుకోవాలి
పిలుపునిచ్చిన మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి – ఏపీ సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధునిక సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించు కోవాలని సూచించారు. అభివృద్ధి సంక్షేమ పధకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేశారు మంత్రి.
వెబ్ సైట్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు . ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేక వార్తలపై ఆయా శాఖల ద్వారా వెంటనే వివరణ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా సమాచారశాఖ పని చేయాలని ఆదేశించారు.
అభివృద్ధి సంక్షేమ పధకాలకు చెందిన సమాచారంపై డేటా బ్యాంకు ఏర్పాటు చేయాలని అన్నారు ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా సమాచార పౌరసంబంధాల శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు అప్ డేట్ కావాలన్నారు..
గురువారం రాష్ట్ర సచివాలయంలో సమాచార శాఖ క్షేత్రాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాచారశాఖ అంటే ప్రభుత్వానికి కళ్ళు, చెవులు వంటిదని అన్నారు.
ఇందుకు అవసరమైతే ఆయా రంగాలకు చెందిన నిపుణులతో ఉద్యోగులకు తగిన శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయాలని సమాచారశాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లాకు మంత్రి పార్ధసారధి సూచించారు.
ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన శాఖల వారీగా పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రత్యేక డేటా బ్యాంకును ఏర్పాటు చేసుకునేందుకు తగిన మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇందుకై ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసుకోవాలని మంత్రి పార్దసారధి చెప్పారు.