ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత
ఇంటికి వస్తానని సవాల్ విసిరిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన సవాల్ కు ప్రతి సవాల్ విసిరారు అరికెపూడి గాంధీ.
ఆయన మాట్లాడిన మాటలు తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. లకారంతో అనరాని మాటలు అన్నారు పాడి కౌశిక్ రెడ్డిని. అంతే కాకుండా స్వయంగా గాంధీనే తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. దాడికి పాల్పడ్డారు. కోడి గుడ్లు, రాళ్లను విసిరారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఇరు వర్గాలు ఇబ్బంది పడ్డాయి.
శుక్రవారం తనపై దాడిని నిరసిస్తూ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అరికెపూడి గాంధీ ఇంటికి వస్తానని ఛాలెంజ్ చేశాడు. ప్రతి ఒక్కరు తరలి రావాలంటూ కోరారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా గాంధీ ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరో వైపు పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేశారని తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగారు మాజీ మంత్రి , బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీశ్ రావు. ఆయనను పరామర్శించారు. ఎవరూ కూడా వెనక్కి తగ్గవద్దని , తాడో పేడో తేల్చుకుందామని స్పష్టం చేశారు.
దీంతో పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఆ వెంటనే హరీశ్ రావును అరెస్ట్ చేశారు. నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.