NEWSANDHRA PRADESH

ఏలూరును చూస్తే బెజ‌వాడ గుర్తొస్తోంది

Share it with your family & friends

ఆవేద‌న వ్య‌క్తం చేసిన వైఎస్ జ‌గ‌న్ రెడ్డి

కాకినాడ జిల్లా – ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం కాకినాడ జిల్లా పిఠాపురంలో ప‌ర్య‌టించారు. ఏలేరు వరద ఉధృతితో అతలాకుతలమైన గ్రామాలను సంద‌ర్శించారు. మాధవపురం, యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి, రమణక్కపేటలో వరద బాధితులను పరామర్శించి, వారికి కలిగిన నష్టాన్ని ఆరా తీశారు.

ఆ తర్వాత, రమణక్కపేటలో శ్రీ వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. ఏలేరు రిజర్వాయర్‌ దగ్గర పరిస్థితి చూస్తే విజయవాడ గుర్తుకొస్తోందని అన్నారు. ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ చేయలేద‌ని, తుపాన్‌పై ముందే సమాచారం ఉన్నా, ప్రభుత్వం పట్టించు కోలేద‌ని ఆరోపించారు.

క‌నీసం కలెక్టర్లతో మాట్లాడే ప్ర‌య‌త్నం ఏమీ చేయ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ప్రత్యేక అధికారులను జిల్లాలకు పంపించాలి కానీ సీఎం చంద్రబాబు ఆ పని చేయ లేద‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్ రెడ్డి. సీఎస్‌ కూడా ఏ మాత్రం పట్టించు కోలేదని మండిప‌డ్డారు.

సీఎం చంద్రబాబుకు మానవత్వం ఉంటే, మనుషుల విలువ తెలిసి ఉంటే, స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించి, ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుని, ముందు జాగ్రత్తలు చేపట్టే వారు. కానీ, అవేమీ చేయలేదు. అన్నీ గాలికొదిలేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నేను చంద్రబాబును అడుగుతున్నాను. ఏలేరు రిజర్వాయర్‌ సామర్థ్యం దాదాపు 23 టీఎంసీలు. సెప్టెంబరు 1న ఏలేరు రిజర్వాయర్‌కు 9950 క్యూసెక్స్‌ ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రభుత్వం జాగ్రత్త పడి ఉంటే, ఆ మొత్తం కిందకు వదలాలి. ఎందుకంటే దిగువన కాలువ సామర్థ్యం 14 వేల క్యూసెక్స్‌.

అలా అప్పుడు నీరు వదిలి ఉంటే, ఆ కాలువ కూడా పొంగకుండా ఉండేది. కానీ ప్రభుత్వం ఏం చేసింది. కేవలం 300 క్యూసెక్స్‌ మాత్రమే వదిలి పెట్టిందని అన్నారు .