పేదల బియ్యం దారి మళ్లింపుపై చర్యలు
తప్పవని హెచ్చరించిన నాదెండ్ల మనోహర్
అమరావతి – ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పందుల్లాగా పేదల బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు చేర వేశారంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ విచారణకు ఆదేశించడం జరిగిందని తెలిపారు నాదెండ్ల మనోహర్.
శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. పేదల బియ్యం దారి మళ్లింపుపై వ్యవహారంపై చర్యలకు రంగం సిద్ధం చేశామని స్పష్టం చేశారు. దారి మళ్లించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో ఎవరున్నా, ఎంతటి వారైనా సరే వదిలి పెట్టే ప్రసక్తి లేదని అన్నారు.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇంకా నివేదిక రాలేదని, సమగ్ర నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
అయితే ఈ దారి మళ్లిన బియ్యం వివరాల గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. వరద సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతతో పని చేస్తోందని అన్నారు నాదెండ్ల మనోహర్.