వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం మల్లన్నకు చోటు
శ్రీశైలం మల్లన్న ఆలయానికి అరుదైన పురస్కారం
కర్నూలు జిల్లా – ఏపీలో అత్యంత పుణ్య క్షేత్రంగా భాసిల్లుతోంది కర్నూలు జిల్లాలోని శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం. దేశంలోనే పేరు పొందిన శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఇక్కడే ఉంది. ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు మల్లన్నను దర్శించుకుంటారు.
ఇదిలా ఉండగా కోట్లాది మంది భక్తులను కలిగిన శ్రీశైలం పుణ్య క్షేత్రం అరుదైన పురస్కారానికి ఎంపికైంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో శ్రీశైలం మల్లన్న స్వామికి చోటు దక్కింది.
ఆలయ విస్తీర్ణం, ఆలయంలోని నంది విగ్రహానికి ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు లభించడం విశేషం. ఈ సందర్బంగా దృవీకరణ పత్రాన్ని అందుకున్నారు ఆలయ ఈవో పెద్దిరాజు.
సమస్త జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లి కార్జున స్వామి దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం విశేషం.. శ్రీశైలం ఆలయ విస్తీర్ణం, అలాగే ఆలయంలోని నంది విగ్రహనికి ఉన్న చరిత్ర, పురాతన పరంగా.. ఆధ్యాత్మికంగా, పౌరాణిక ప్రాముఖ్యత కల్గి ఉన్నందున ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ ఆలయానికి చోటు లభించింది.
ఈ ఆలయానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ధృవీకరణ పత్రం అందింది. ఈ ధృవీకరణ పత్రాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆలయ ఇవో పెద్ది రాజుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ అల్లాజీ ఎలియజర్ అందజేశారు.
గతంలోనూ ఈ దేవస్థానం ఏడు విభాగాలకు ఐఎస్ఓ ద్వారా దృవీకరణ పత్రం అందుకుంది. కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారి ఆలయం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది.
శివరాత్రి, ఉగాది ఉత్సవాల సమయంలో రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తుంటారు ఇక్కడికి.