రేవంత్ రెడ్డి కాదు చిట్టి నాయుడు – కేటీఆర్
తెలంగాణ సీఎంకు అంత సీన్ లేదు
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన గాడి తప్పిందని ఆరోపించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకున్నాడని, తాను సీఎం పదవికి అనర్హుడని పేర్కొన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ఆ జిల్లా పాలిట శాపంగా మారాడని ధ్వజమెత్తారు కేటీఆర్. ఇది మంచి పద్దతి కాదన్నారు. పేదల ఇళ్లను కూల్చి వేసే అధికారం ముఖ్యమంత్రికి ఎవరు ఇచ్చారంటూ నిలదీశారు కేటీఆర్.
అధికారం అనేది ఏ ఒక్కరికీ శాశ్వతం కాదన్నారు. ఇది గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. ఇదే సమయంలో ఇప్పటి వరకు కొలువు తీరిన 9 నెలల కాలంలో 79 వేల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు.
హైదరాబాద్‌లో ఐటీ, అనుబంధ పరిశ్రమలకు కేటాయించడానికి ఉద్దేశించిన సుమారు 400 ఎకరాల విలువైన భూమిని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు పెట్టి రూ. 10 వేల కోట్ల రుణాన్ని తీసుకోవడానికి రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు కేటీఆర్.
ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.