DEVOTIONAL

వేద విద్యార్థులు ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిల‌వాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన మాజీ సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం

తిరుమల – వేద విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, సనాతన హిందూ ధర్మ సంరక్షకులుగా వ్యవహరించి సంస్థ ఖ్యాతిని నలు దిశల వ్యాప్తి చేయాలని ఏపి మాజీ సిఎస్‌, టీటీడీ మాజీ ఈవో ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఉద్ఘాటించారు.

తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఏపీ మాజీ సిఎస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వందలాది మంది విద్యార్థులకు వేద విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం దేశంలోనే పురాతన విద్యా సంస్థల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు.

విద్యార్థులు తమ విద్యా సంస్థ గొప్ప చరిత్ర గురించి ముందుగా తెలుసు కోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత ఒకటిన్నర శతాబ్దాలలో ఇది గొప్ప విద్యా కేంద్రంగా, వేదాల రంగంలో ఎందరో ప్రముఖులను తయారు చేసిందన్నారు. కాబట్టి ఈ సంస్థ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం ప్రతి విద్యార్థి బాధ్యత అని వివరించారు.

ముందుగా టీటీడీ అదనపు ఈవో స్వాగతోపన్యాసం చేస్తూ, విద్యార్థులకు వేద విద్యను అందించడమే కాకుండా వారి శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నామన్నారు. తిరుమలలో విద్యార్థులకు యోగా, ధ్యానంతో పాటు క్రీడా సముదాయమును కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

వేద విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు, వారి భవిష్యత్ ను నిర్మించు కోవడానికి, వారి వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగ పడేలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులచే ఇకపై తరచు ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు .

ఈ కార్యక్రమంలో ధర్మగిరి ప్రిన్సిపాల్ కేఎస్‌ఎస్ అవధాని, విఎస్‌వో సురేంద్ర, వేద అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.