బాబు చేతిలో విశాఖ ఉక్కు తుక్కు తుక్కు
నిప్పులు చెరిగిన అంబటి రాంబాబు
గుంటూరు జిల్లా – ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. నిన్నటి దాకా ఓట్ల కోసం ప్రజలను మభ్య పెట్టిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఆదివారం అంబటి రాంబాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దానిని ప్రైవేట్ పరం చేసేందుకు ప్లాన్ జరుగుతోందని ఆరోపించారు. ఎందరో త్యాగాలు చేస్తే వచ్చిన ఈ ఉక్కు పరిశ్రమను గంపగుత్తగా ప్రైవేట్ పరం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆయన పరివారం, కేంద్ర సర్కార్ పావులు కదుపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీకి తలమానికంగా నిలుస్తూ వచ్చిందని, దేశ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తోందని, ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత ఈ సంస్థదేనని పేర్కొన్నారు .
ఏపీలో కొలువు తీరిన కొత్త కూటమి ప్రభుత్వంలో టీడీపీతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఎందుకని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రశ్నించడం లేదంటూ నిప్పులు చెరిగారు ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు.
అధికారంలోకి రాక ముందు ఒక మాట వచ్చాక ఇంకో మాట మాట్లాడటం చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారిందని ఆరోపించారు.