పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేసే కుట్ర
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్
విజయవాడ – ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి . ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా అని నిలదీశారు. ఇప్పటికే అందని ద్రాక్షలా మారిన వైద్య విద్యను ,పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు.
గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యాయనం చేయాలని అనుకున్నారు ? జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి వెంటనే నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ పై సమాధానం చెప్పాలని అన్నారు.
కూటమి సర్కార్ లో భాగస్వామ్య పక్షంగా ఉండి, ఈ ఏడాది 5 కొత్త కాలేజీలు పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పాడేరుల్లో వసతులను కల్పించలేమంటూ చేతులెత్తేయడం దారుణమన్నారు.
నిర్వహించడం సాధ్య పడదని, అదనపు సీట్లు కూడా అవసరం లేదని.. మెడికల్ బోర్డు కి లేఖ రాయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ప్రభుత్వ రంగంలో అదనపు సీట్లు వస్తుంటే ఏ రాష్ట్రమైనా వద్ధనుకుంటుందా ? ఇది కూటమి సర్కారుకు సిగ్గుచేటు అని పేర్కొన్నారు.
కొత్తగా 750 సీట్లు సమకూరక పోవడం మీ నిర్లక్ష్యం ఫలితమేనని ఎద్దేవా చేశారు. లక్షలు పోసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న పిల్లల భవిష్యత్ ను అగమ్య గోచరంగా మార్చారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
విద్యార్థుల ఆశలను నీరు గార్చారంటూ ధ్వజమెత్తారు. మెడికల్ సీట్లకోసం పక్క రాష్ట్రాల బాట పట్టేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.