విజయవాడలో మెరుగు పడిన పరిస్థితి
మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
విజయవాడ – ఏపీ పురపాలిక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలలో మరోసారి పర్యటించారు. ఆదివారం విజయవాడ లోని కండ్రికలో జరుగుతున్న పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు.
అనంతరం ఇళ్లలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు ఏపీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. బెజవాడలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని చెప్పారు. అన్నీ మెరుగు పడ్డాయని, సాధారణ స్థితి ప్రస్తుతం నెలకొందని చెప్పారు.
పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లను ఉపయోగిస్తున్నామని, ఇళ్లను శుభ్రం చేసే ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని స్పష్టం చేశారు. మరో వైపు మళ్లీ వరద అంటూ తప్పుడు ప్రచారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్ పొంగూరు నారాయణ. దీనిని ప్రతిపక్ష పార్టీ వైసీపీ కుట్రగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
దీనిపై డీజీపీ ద్వారకా తిరుమల రావుకు ఫిర్యాదు కూడా చేశామని చెప్పారు డాక్టర్ పొంగూరు నారాయణ. చంద్రబాబు పాలన దక్షత చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విష ప్రచారాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని, చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డాక్టర్ పొంగూరు నారాయణ.