బీఆర్ఎస్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సంచలన కామెంట్స్ చేసింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం. సోమవారం రాష్ట్రంలోని 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిన కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం. ఈ సందర్బంగా స్పీకర్ ను ఏకి పారేసింది. వచ్చే సంవత్సవరం సెలబ్రేషన్స్ నీ కుటుంబంలో చేసుకుంటావా లేక జైలులో ఉంటావా అని తేల్చుకోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీజేఐ గవాయ్. ఆయన తాజాగా చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ సీనియర్ నేత అనుగుల రాకేష్ రెడ్డి.
సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ఇకనైనా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మారాలని హితవు పలికారు. ఇది ఎంతమాత్రం మంచి పద్దతి కాదన్నారు. పూర్తిగా దాటవేత ధోరణి అవలంభించడం, మరికొంత సమయం కావాలని కోరవడం ఇదంతా కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకంలో ఓ భాగమని పేర్కొన్నారు రాకేష్ రెడ్డి. మరి స్పీకర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా లేక జైలుకు వెళతారో తేల్చు కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నిజంగా ఇలాంటి స్పీకర్ ను ఒకసారి జైల్లో వేస్తే కానీ దేశంలో ఇంకోసారి ఫిరాయింపుల విషయంలో స్పీకర్లు ఇలా నాటకాలు చేయరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు . లేకపోతే స్పీకర్లను అడ్డం పెట్టుకొని పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అలవాటుగా మారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.






