రూ. 5 లక్షల చొప్పున ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ : సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం . ఈమేరకు కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించింది సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. బస్సు దహనం కేసులో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్. సోమవారం ఆయన మక్కా హౌజ్ నుండి స్వయంగా పర్యవేక్షించారు. అక్కడి రాయబారితో ఫోన్ లో మాట్లాడారు. కేంద్ర మంత్రితో సహకరించాలని కోరారు. అంతే కాకుండా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని ప్రభుత్వ బృందాన్ని సౌదీ అరేబియాకు పంపాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.
ఈ బృందంలో ఎంఐఎం ఎమ్మెల్యేలలో ఒకరు, మైనార్టీ సమాజానికి చెందిన ఓ సీనియర్ అధికారి కూడా ఈ టీంలో ఉంటారని కేబినెట్ వెల్లడించింది. అంతే కాకుండా ప్రతి బాధితుడి కుటుంబంలో నుంచి ఇద్దరు సభ్యులను కూడా సౌదీ అరేబియాకు తీసుకెళ్లనున్నారు. మృతుడి అంత్యక్రియలు సౌదీ దేశంలోనే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు తెలియ చేయడం జరిగిందని చెప్పారు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్. ఇదిలా ఉండగా ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం స్పందించారు. ఆయన నేరుగా రియాద్ రాయబారితో పాటు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జై శంకర్ తో మాట్లాడారు.






