మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఓట్ చోరి ఏ విధంగా జరుగుతుందో రాహుల్ గాంధీ నిరూపించారని, ఇదే బీహార్ లో బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి మరోసారి మోసానికి పాల్పడ్డాయని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఎన్నికల కమిషన్ దానిని ఎందుకు చూపెట్టలేక పోయిందంటూ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా ఓట్లు తొలగించి చోరికి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే బీహార్ లో గెలిచారని, ప్రజాస్వామ్యం ఓడి పోయిందని వాపోయారు. దేశ వ్యాప్తంగా ఓట్ చోరీ పై ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో దీర్ఘకాలిక పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసిన వారసత్వం ఉన్న పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలుపుతోందని చెప్పారు.
తెలంగాణ యూత్ కాంగ్రెస్ సైనికులుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి శక్తివంతంగా పని చేయాలని పిలుపునిచ్చారు పొన్నం ప్రభాకర్ గౌడ్. దేశ వ్యాప్తంగా ఓట్ చోరి నిరసనలు ఉదృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం ఓట్ చోరికి వ్యతిరేకంగా గాంధీ భవన్ లో తెలంగాణ యువజన కాంగ్రెస్ మహా నిరసన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ భాను చిబ్ ,రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి ,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ,యూత్ కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి యూత్ కాంగ్రెస్ నివాళులు అర్పించారు.






