ఏపీ కూటమి సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ షర్మిల
విజయవాడ : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థనా..? లేక మోడీ బినామీ కంపెనీనా..? ఎంత ఉత్పత్తికి అంతే వేతనం ఏంటి ? ఉత్పత్తి లేదని నింద కార్మికుల మీద మోపుతారా ? ఏకంగా బహిరంగ సర్క్యులర్ ఇస్తారా ? దేశంలో భారతీయ కార్మిక చట్టమే ఉందా లేక మోడీ లేబర్ చట్టం అమల్లో ఉందా ? ఆంధ్రుల హక్కుతో ఇదేం చెలగాటం ? ఇది కేంద్ర ప్రభుత్వ కండ కావరానికి, నియంత మోడీ వికృత చేష్టలకు నిదర్శనం అంటూ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ను అమ్మే కుట్రలో భాగమే ఇదంతా అంటూ ధ్వజమెత్తారు. సోమవారం షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
30 వేల మంది కార్మికులు ఉంటే 18 వేలకు కుదించారని వాపోయారు. స్టీల్ ఉత్పత్తికి కావాల్సిన ముడి సరుకులు తగ్గించారు కావాలని అంటూ మండిపడ్డారు. 45 రోజుల పాటు సరిపడా నిల్వ ఉండాల్సిన రా మెటీరియల్ 5 రోజులకు మించి పెట్టడం లేదన్నారు. ఐరన్ ఓర్ అందక నెలకు వారం రోజులు ఉత్పత్తి ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్ ఆపేశారు. స్పేర్ పార్ట్స్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు షర్మిలా రెడ్డి. స్టీల్ ప్లాంట్ రవాణాకు కావలసిన రైల్వే వ్యాగన్లు ఇవ్వకుండా అడ్డుకట్ట వేశారని ఆరోపించారు.






