బోట్ల తొలగింపు పనుల పరిశీలన
మంత్రులు అనిత..నిమ్మల
విజయవాడ – భారీ వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది బెజవాడ నగరం. ఈ సందర్బంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద చోటు చేసుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉండగా మంగళవారం ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారితో కలిసి పరిశీలించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.
కృష్ణా నదిలోకి బోటులో వెళ్లి పనులు జరుగుతున్న తీరును దగ్గరుండి పరిశీలించడం విశేషం. గత 5 రోజులుగా బోట్ల వెలికితీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఈ సందర్బంగా చెప్పారు మంత్రులు నిమ్మల రామా నాయుడు , వంగలపూడి అనిత.
వాటర్ పూలింగ్ ద్వారా నీటి అడుగున ఉన్న బోటు రెండు అడుగులు పైకి తేవడం జరిగిందన్నారు. మరో అడుగు పైకి వస్తే బోటు కదులుతుందని అధికారులు తెలిపారు మంత్రులకు. బ్యారేజ్ భద్రత, ప్రజలకు ఇబ్బంది లేకుండా బోట్లను తొలగించే పనులు చేస్తున్నామని స్పష్టం చేశారు.