రాజీవ్ గాంధీ దేశానికి రోల్ మోడల్ – సీఎం
సచివాలయం ముందు విగ్రహం ఆవిష్కరణ
హైదరాబాద్ – ఈ దేశానికి దిశా నిర్దేశం చేసిన ప్రధానమంత్రులలో మోస్ట్ పాపులర్ పీఎం దివంగత రాజీవ్ గాంధీ అని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. మంగళవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని సచివాలయం ముందు ఏర్పాటు చేసిన దివంగత భారత దేశ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.
అనంతరం ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో తన జన్మ ధన్యమైందన్నారు.
రాష్ట్ర సచివాలయం ముందు ఆధునిక భారత నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు సీఎం.
ప్రాణ త్యాగాలు… పదవీ త్యాగాలు…చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిదని గుర్తు చేశారు. ఈ దేశానికి తొలి పునాదులు…ఆధునిక భారతానికి బాటలు వేసింది గాంధీ కుటుంబమని కొనియాడారు ఎ. రేవంత్ రెడ్డి.
రాజీవ్ ఈ దేశ యువతకు రోల్ మోడల్ అని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం ముందు ఆ మహనీయుడి విగ్రహం పరిపాలనకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు.
తాను బయటకు కదలకుండా ఇంట్లో ఉండేందుకు ఫాంహౌస్ ముఖ్యమంత్రిని కాను అని చెప్పారు. తాను కష్టపడి పనిచేసే సీఎంనని అన్నారు.
తన స్వార్థం కోసమో, వ్యక్తిగత పనుల కోసమో ఢిల్లీకి పదే పదే వెళ్లడం లేదని చెప్పారు. కేవలం రాష్ట్ర ప్రజల కోసం , రాష్ట్ర అభివృద్ది కోసం మాత్రమే వెళుతున్నానని అన్నారు రేవంత్ రెడ్డి. తనను ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై స్పందించారు . తాను ఇప్పటి వరకు 23 సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.