స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా : రాష్ట్ర గిరిజనాభివృద్ది, స్త్రీ మహిళా సంక్షేమ శాఖ మంత్రి దాసరి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తల్లిదండ్రుల గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. రోజు రోజుకు ఆస్తులను పోగేసు కోవడంపై చూపించిన శ్రద్ద వారిని కన్న తల్లిదండ్రులపై పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అందుకే తమ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎవరైతే పిల్లలు తమ పేరెంట్స్ ను పట్టించుకోరో వారిని గుర్తించి వారికి సంబంధించిన ఆస్తులను పేరెంట్స్ పై మారుస్తామని హెచ్చరించారు.
బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ , బాల్య వివాహాలపై ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్బంగా పోస్టర్లు ఆవిష్కరించారు. బాల్య వివాహాలు పిల్లల అభివృద్ధికి విఘాతం అని, కావున బాల్య వివాహాలను అడ్డుకొని ములుగును బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ విషయంలో CDPO లు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి, ITDA PO చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ చందర్ జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.






