NEWSTELANGANA

తెలంగాణ ఎన్నిక‌ల అధికారిగా రాణి కుముదిని

Share it with your family & friends

నియ‌మించిన రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మంగ‌ళ‌వారం రిటైర్డ్ సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ గా ఉన్న రాణి కుముదినికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులు జారీ చేసింది.

రాణి కుముదినిని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా నియ‌మిస్తున్న‌ట్లు తెలిపింది. ఇక‌ 1988 బ్యాచ్‌కి చెందిన కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.

కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2023 ఎన్నికలకు ముందు ఆమె పదవీ విరమణ చేశారు.

ఎస్‌ఈసీగా పార్థసారధి పదవీకాలం ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాణి కుముదిని రాష్ట్ర ఎన్నిక‌ల అధికారిణి గా నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆమె మూడేళ్ల పాటు ఎస్‌ఈసీగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త ఎస్ఈసీ నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది.

మరోవైపు రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఎంజీ గోపాల్‌ను ప్రభుత్వం నియమించింది. 1983 బ్యాచ్‌కు చెందిన గోపాల్ యూనియన్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయనను రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా మూడేళ్ల పాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.