జానీ మాస్టర్ సరే త్రివిక్రమ్ మాటేంటి..?
నటి పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – తెలుగు సినీ పరిశ్రమలో కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం కలకలం రేపుతోంది. తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ ఓ మహిళా కొరియో గ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు.
ఈ మొత్తం వ్యవహారంపై తెలుగు ఫిలిం చాంబర్ సంస్థ స్పందించింది. ఈ మేరకు సంస్థ సభ్యులు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, నటి ఝాన్సీ మీడియాతో మాట్లాడారు. బాధితురాలకు సంస్థ అండగా ఉంటుందని ప్రకటించారు.
ఇలాంటి లైంగిక వేధింపులను ప్రోత్సహించే సంస్కృతి తప్పని పేర్కొన్నారు. ఈ సందర్బంగా బాధితురాలికి తాము అండగా ఉంటామని ప్రకటించారు. ఇదిలా ఉండగా తెలుగు ఫిలిం చాంబర్ కు గతంలో తాను ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించ లేదంటూ నిలదీశారు ప్రముఖ నటి పూనమ్ కౌర్.
ఆమె ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రధానంగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యవహారంపై విచారణ చేపట్టాలని , ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేయడం కలకలం రేపింది. మొత్తంగా జానీ మాస్టర్ సరే త్రివిక్రమ్ కథేమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు పూనమ్ కౌర్.