DEVOTIONAL

కూరగాయల దాతల సేవ‌లు భేష్

Share it with your family & friends

అభినందించిన అదనపు ఈవో చౌద‌రి

తిరుప‌తి – గ‌త‌ రెండు దశాబ్దాలుగా టీటీడీ అన్నప్రసాదం కార్యకలాపాలకు వివిధ రాష్ట్రాల నుండి పంపుతున్న కూరగాయల దాతల అపారమైన సహకారాన్ని కొనియాడారు అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి.

లక్షలాది మందికి అన్న ప్రసాదాన్ని మరింత రుచి కరమైన రీతిలో అందించడానికి మరిన్ని రకాల కూరగాయలను పంపాలని అదనపు ఈవో కోరారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో కూరగాయల దాతలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడారు. ఏడాది పొడవునా తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు పరిశుభ్రమైన రీతిలో రుచికరమైన, ఆరోగ్య కరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ నినాదమని అన్నారు.

అన్న ప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో భుజించే ఆఖరి భక్తునికి కూడా అందేలా మరిన్ని రకాల కూరగాయలను విరివిగా అందించాలని దాతలను కోరారు. అందుకు దాతలు తాము ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నామని ముక్త కంఠంతో తెలిపారు.

అంతకు ముందు, ప్రత్యేక క్యాటరింగ్ అధికారి జిఎల్‌ఎన్ శాస్త్రి 2004లో ప్రారంభించిన కూరగాయల విరాళం గత 20 ఏళ్లలో సాధించిన ప్రగతిని గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

అనంతరం అదనపు ఈవో కోయింబేడు, తిరుప్పూర్, నామక్కల్, చిక్కబల్లాపూర్, విజయవాడ, పలమనేరు, హైదరాబాద్, తిరుపతికి చెందిన 24 మంది కూరగాయల దాతలను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, ఇతర అన్నప్రసాదం సిబ్బంది పాల్గొన్నారు.