వరద బాధితుల కోసం అనన్య విరాళం
ఏపీ సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
అమరావతి – వరదల కారణంగా తీవ్రంగా నష్ట పోయిన వరద బాధితుల కోసం తమ వంతుగా సినీ నటులు, ప్రముఖులు, దాతలు సాయం చేస్తున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండున్నర లక్షల రూపాయల చెక్కును ప్రముఖ నటి అనన్య నాగళ్ల సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వయసు మీద పడినా ఎక్కడా అలిసి పోకుండా రాష్ట్ర అభివృద్ది కోసం కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడును ఈ సందర్బంగా కలుసు కోవడం తనకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు నటి అనన్య నాగళ్ల.
బుధవారం నటి స్వయంగా ఏపీ సీఎంను కలుసుకున్నారు. తన వంతుగా ఉడతా భక్తిగా సాయం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నటి అయినప్పటికీ ఏపీ వరద బాధితుల కోసం తన వంతు సాయం చేయడం పట్ల ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
అనన్య నాగళ్లను మిగతా నటీ నటులు ఆదర్శంగా తీసుకోవాలని, ఏపీ వరద బాధితుల కోసం తమ వంతు సాయం చేయాలని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి. ఇదిలా ఉండగా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం భారీ విరాళాలను ప్రకటించారు.