బాబూ అప్పులు సరే లెక్కలేవి..?
సీఎంను ప్రశ్నించిన విజయ సాయి రెడ్డి
అమరావతి – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎంత కాలం అప్పులు చేసుకుంటూ వెళతారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ కూటమి ప్రభుత్వం అప్పులు చేయడంలో టాప్ లో కొనసాగుతోందని ఆరోపించారు. ఇది ప్రజలపై పెను భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ఇలాగే అప్పులు చేస్తూ పోతే చివరకు చిప్ప కూడు లభిస్తుందని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు బాబు సర్కార్ ప్రతి నెలా అప్పులు చేస్తూ పోతోందని ఆరోపించారు . గత జూన్ లో రూ. 2,000 కోట్ల రుణం తీసుకుందని, జూన్ 11న రూ. 5,000 కోట్లు. జూలై 2న రూ. 2,000 కోట్లు. జూలై 16న రూ. 3,000 కోట్లు. జూలై 30న రూ. 3,000 కోట్లు రుణంగా తీసుకుందని తెలిపారు ఎంపీ.
అంతే కాకుండా గత ఆగస్టు నెలలో 27న రూ. 4,000 కోట్లు అప్పుగా తీసుకుందని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎన్నికల సందర్బంగా ఇచ్చిన టీడీపీ తన మేనిఫెస్టోను అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఇన్ని కోట్లు అప్పుగా తీసుకు వచ్చిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్పాలని విజయ సాయి రెడ్డి డిమాండ్ చేశారు.