బీజేపే నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
విజయవాడ – కాంగ్రెస్ నాయకుడు, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.
బుధవారం విజయవాడలోని వన్ టౌన్ గాంధీ విగ్రహం దగ్గర ఏపీసీసీ భారీ నిరసన చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డితో పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీకి రోజు రోజుకు పెరుగుతున్న జనాదరణను చూసి ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు వైఎస్ షర్మిల. రాహుల్ గాంధీని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నా మోడీ , అమిత్ షా లు ఎందుకు పట్టించు కోవడం లేదంటూ ప్రశ్నించారు . ఇదంతా వారి డైరెక్షన్ లోనే జరుగుతోందన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈ దుర్మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ద్వేష పూరిత మాటలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు ఈ దేశంలో తీవ్రవాదులు ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఈ దేశంలో అట్టడుగు వర్గాల వాళ్ళు 90 శాతం మంది ఉన్నారని చెప్పడం నేరం ఎలా అవుతుందని నిలదీశారు ఏపీ పీసీసీ చీఫ్.
ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ, అన్ని కులాలను, మతాలను సమానంగా చూసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాహుల్ గాంధీని తీవ్రవాది అంటున్నారు.
రాహుల్ అమ్మమ్మ, నాన్న ఇద్దరు తీవ్రవాదుల చేతుల్లో బలి అయ్యారని, ఈ విషయం బీజేపీకి తెలియదా అని మండిపడ్డారు .