గాంధీ ఆస్పత్రిపై బురద చల్లడం బాధాకరం
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ
హైదరాబాద్ – పేదలు, రోగులకు విశిష్ట సేవలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రిపై బురద చల్లడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. బుధవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ట్రీట్మెంట్ కోసం వచ్చే నిరుపేదల మనో స్థైర్యాన్ని దెబ్బతీయడం బాధాకరమని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పిటళ్లు ఏ విధంగా ఎదిగాయో ప్రజలందరికీ తెలుసని, ప్రభుత్వ దవాఖాన్లను ఎలా దెబ్బతీశారో కూడా జనాలు మర్చి పోలేదని తెలిపారు మంత్రి.
గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ దవాఖాన్లను పది సంవత్సరాల పాటు నాశనం చేసిన బీఆర్ఎస్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే తరహా కుట్రలు చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.
గాంధీ వంటి టెర్షియరీ కేర్ హాస్పిటళ్లకు అత్యంత విషమంగా ఉన్న పేషెంట్లు వస్తారని, చివరి నిమిషం వరకూ వాళ్ల రోగాన్ని నయం చేసి, ఎలాగైనా వాళ్లను బ్రతికించేందుకు డాక్టర్లు తమ శక్తిమేర ప్రయత్నిస్తారని స్పష్టం చేశారు దామోదర రాజ నరసింహ.
అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కొంత మంది ప్రాణాలు కోల్పోతారని, అందుకే దేశంలోని ఏ టెర్షియరీ కేర్ హాస్పిటల్‌లోనైనా, ప్రతి నెలా పదుల సంఖ్యలో మరణాలు జరుగుతుంటాయని పేర్కొన్నారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే మరణాలు జరిగాయంటూ నంబర్లను భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించారు. ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హితవు పలికారు. ఆయన అజ్ఞానానికి, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే సహజ గుణానికి చేసిన కామెంట్స్ అద్దం పడుతున్నాయని ఆరోపించారు.
గాంధీని నాశనం చేసి, పేషెంట్లను రానీయకుండా చేసి కార్పొరేట్ హాస్పిటళ్లకు లబ్ది చేకూర్చాలని కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు దామోదర రాజ నరసింహ. ఆ కుట్రలో భాగంగానే గాంధీ హాస్పిటల్‌పై బురద జల్లుతున్నారని ఆరోపించారు.
ఇకనైనా ఇలా పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేయడం మానుకోకపోతే, ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
గాంధీ దవాఖానకు వచ్చేది దొర జనం కాదు, నా జనం. నేను కూడా పాత గాంధీ హాస్పిటల్లోనే పుట్టిన. నా జనాల బాగోగులు చూసుకోవడం నా బాధ్యత అని ఇదివరకే చెప్పాను. మళ్లీ చెబుతున్నానని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ కుట్రలను నమ్మి భయపడకండి. ధైర్యంగా వచ్చి చికిత్స చేయించు కోవాలని పిలుపునిచ్చారు.