తిరుమల లడ్డూపై చంద్రబాబు కామెంట్స్
జంతువుల నూనెను వాడారంటూ ఫైర్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది భక్తులు నిత్యం కొలిచే శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలకు సంబంధించిన తిరుమల ప్రసాదంపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.
ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. గతంలో ఏపీలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాపానికి ఒడిగట్టిందని ఆరోపించారు ఏపీ సీఎం.
తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు నారా చంద్రబాబు నాయుడు. లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువులకు సంబంధించిన నూనెను వాడారంటూ తనకు తెలిసిందంటూ సీఎం చెప్పడం విస్తు పోయేలా చేసింది.
విషయం తెలుసుకున్న తాను ఆందోళనకు గురైనట్లు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు తాము స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నట్లు చెప్పారు. తాజాగా ఏపీ సీఎం చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఎలాంటి విచారణకైనా తాము సిద్దంగా ఉన్నామంటూ ప్రకటించారు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు.