నందిని నెయ్యిని ఎందుకు తొలగించారు..?
దీనికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలన్న టీడీపీ
అమరావతి – ప్రస్తుతం ఏపీ, తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. చర్చకు దారి తీశాయి. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి. లడ్డూ తయారీకి జంతువుల నెయ్యి వాడారంటూ సంచలన ఆరోపణలు చేశారు నారా చంద్రబాబు నాయుడు.
దీనిపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. ఇదంతా కావాలని రాజకీయంగా దెబ్బ తీసేందుకు బాబు పన్నిన పన్నాగం అంటూ కొట్టి పారేసింది. ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేపట్టేందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చింది.
దీనిపై తెలుగుదేశం పార్టీ గురువారం తీవ్రంగా స్పందించింది. ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. 50 ఏళ్ళుగా తిరుమల లడ్డూలో ఉపయోగించే కర్ణాటక కేఎంఎఫ్కి చెందిన నందిని నెయ్యిని జగన్ రెడ్డి ఎందుకు ఉన్నట్టు ఉండి తొలగించాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసింది.
తిరుపతి లడ్డూ తయారీకి 50 ఏళ్ళుగా సరఫరా చేస్తున్న నందిని నెయ్యిని కాదని, తమిళనాడు కంపెనీకి ఎందుకు ఇచ్చాడో చెప్పాలంటూ నిలదీసింది. 50 ఏళ్ళుగా నాణ్యతతో కూడిన నందిని నెయ్యిని జగన్ ఎందుకు వద్దు అన్నాడు ? తక్కువ ధరకు నెయ్యి అంటూ, నాణ్యత లేని నెయ్యి తీసుకొచ్చి, తిరుమల లడ్డూకి రుచి లేకుండా చేయటం వెనుక జగన్ రెడ్డి చేసింది కుట్ర కాక మరేంటి అంటూ ప్రశ్నించింది టీడీపీ.