టూరిజం హబ్ గా ఆంధ్రప్రదేశ్
38 విభాగాల్లో అవార్డుల ప్రదానం
అమరావతి – పర్యాటక ప్రాంతంగా ఏపీని అభివృద్ది చేస్తామని చెప్పారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. సెప్టెంబర్ 27 వ తేదీన వరల్డ్ టూరిజం డే సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
38 విభాగాల్లో టూరిజంకు సంబంధించిన హోటళ్లు, స్పాట్లలో అవార్డుల ప్రదానం చేస్తామన్నారు. కేంద్రం సహకారంతో రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో అన్ని చోట్ల టురిజం అభివృద్ధి జరుగుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ శాసి, ప్రసాద్, స్వదేశీ దర్శన్ స్కీంలతో రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడతామని తెలిపారు మంత్రి . రాష్ట్రంలో 4 ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
శ్రీశైలంలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు కందుల దుర్గేష్. రాజ మహేంద్రవరంలో అఖండ గోదావరి పేరుతో ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
బాపట్లలో బీచ్ కారిడార్ అభివృద్ధి, టూరిజం హబ్ గా సంగమేశ్వరం కోసం కృషి చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా రాజధాని అమరావతిలో మెగా టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. అడ్వంచర్ కేంద్రంగా అరకు, లంబసింగి ఉంటుందన్నారు. రూ. 25.32 కోట్లతో అన్నవరం పుణ్యక్షేత్రం అభివృద్ధి చేస్తామన్నారు కందుల దుర్గేష్.
ఏపీటీడీసీ ద్వారా శక్తి పీఠాలు, పంచారామాలు కలుపుతూ టెంపుల్ ప్యాకేజీ తయారు చేస్తామన్నారు. లఘు చిత్రాల ద్వారా టూరిజం పై పర్యాటకులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తామని అన్నారు. తిరుపతి, గండికోట, పిచ్చుక లంకలో రిసార్ట్స్ ఏర్పాటుకు ఓబెరాయ్ గ్రూప్ ముందుకు వచ్చిందని తెలిపారు.
అక్టోబర్ 15వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక (డీపీఆర్) పంపించి ఆమోదం పొందిన వెంటనే పనులకు శ్రీకారం చుడతామన్నారు కందుల దుర్గేష్. ప్రకృతి వైఫరీత్యాల కారణంగా రాష్ట్రంలో భారీగా నష్టపోయిన పర్యాటక శాఖ.. పునరుద్ధరణ చర్యలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.