స్కిల్ యూనివర్శిటీ బోర్డుతో సీఎం సమావేశం
హాజరసైన బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి సంబంధించిన ఏర్పాటైన బోర్డుతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు.
రాష్ట్ర సచివాలయంలో గురువారం సీఎం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ బోర్డు సభ్యులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కీలక సమావేశానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ చైర్మన్ , ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్ శ్రీను రాజు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హాజరయ్యారు.
వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, విద్యారంగ నిపుణులు, టెక్ దిగ్గజాలు పాల్గొన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని దేశానికే ఆదర్శ ప్రాయంగా తీర్చి దిద్దాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందజేస్తామని స్పష్టం చేశారు.
గౌరవ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో ఈ యూనివర్శిటీ మరింత అద్భుతంగా తయారు కాగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు సీఎం.