స్కిల్ యూనివర్శిటీ సమావేశంలో బ్రాహ్మణి
హాజరైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కొలువు తీరాక తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిందన్న ఆరోపణలు మరింత పెరిగాయి. ఇందుకు తగ్గట్టుగానే ఆంధ్రాకు చెందిన వారికి ప్రయారిటీ ఇస్తున్నారన్న విమర్శలు లేక పోలేదు.
తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా ను నియమించగా కో చైర్మన్ గా ఆంధ్రా ప్రాంతానికి చెందిన శ్రీను రాజును ఎంపిక చేశారు సీఎం.
గురువారం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హెరిటేజ్ ఎండీ , ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోడలు, నందమూరి బాలకృష్ణ తనయ నారా బ్రాహ్మణి హాజరయ్యారు. ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
ఇదిలా ఉండగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ నిర్వహణకు రూ.100 కోట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కీలక అంశాలను అధికారులు పారిశ్రామికవేత్తలకు వివరించారు.
యూనివర్శిటీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించేందుకు కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని, వివిధ హోదాల్లో అన్ని వర్గాల నుంచి సహకారం అందించాలని సీఎం కోరారు.
స్కిల్ యూనివర్సిటీలో ఈ ఏడాది ప్రారంభం కానున్న పలు కోర్సుల వివరాలను కూడా అధికారులు అందించారు.
తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి చాటి చెప్పాలన్న రేవంత్ రెడ్డి ఆలోచన అభినందనీయమని, సీఎం విజన్‌ని చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు.