కొవ్వు వాడడం అనేది ఓ కట్టు కథ
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్
అమరావతి – ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోయి తప్పి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. అన్ని టెస్టులు పూర్తి అయిన తర్వాతనే లడ్డూ తయారీకి నెయ్యిని, ఇతర పదార్థాలను వాడడం జరుగుతుందని స్పష్టం చేశారు.
శుక్రవారం జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేవలం రాజకీయ స్వ ప్రయోజనాల కోసమే ఇలాంటి చవకబారు, నీతి మాలిన మాటలు మాట్లాడటం సరికాదన్నారు . అనుభవం కలిగిన ముఖ్యమంత్రి స్థాయికి తగిన విధంగా ప్రవర్తించక పోవడం దారుణమన్నారు జగన్ మోహన్ రెడ్డి.
దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు మాజీ సీఎం. లడ్డూ తయారీ చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఓ కట్టు కథ అని కొట్టి పారేశారు. ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా.? ఒక సీఎం ఇలా అబద్దాలు ఆడడం ధర్మమేనా.? అని నిలదీశారు జగన్ రెడ్డి.
భక్తుల మనోభావాలతో ఆడుకోవడం మంచిదేనా అని వాపోయారు. ప్రతి 6 నెలలకు ఓసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారని తెలిపారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షను ఎవరూ మార్చ లేదని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోంది అని పేర్కొన్నారు.