ఆలయాల్లో హిందువులకే ఛాన్స్ – సీఎం
అన్న దానాలపై పునః పరిశీలన
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో కొనసాగుతున్న అన్నదానాలతో పాటు ప్రసాదాలపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.
తాజాగా ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సంబంధించి నిత్యం భక్తులకు అందించే లడ్డూ ప్రసాదంపై సంచలన ఆరోపణలు చేశారు. లడ్డూ కల్తీకి గురవుతోందని, నాణ్యత ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై విచారణ చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం తరపున ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఏకంగా సీబీఐతో విచారణకు ఆదేశించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడును కోరారు.
ఇదిలా ఉండగా ఏపీ సీఎం కీలక ప్రకటన చేశారు. ఏపీ అంతటా ఆలయాల్లో చేపడుతున్న అన్న దానాలను పునః పరిశీలించాలని ఆదేశించారు.
హిందూ దేవాలయాల్లో హిందువులు కాని వారిని నియమించు కోవద్దని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో పని చేస్తున్న 1,683 మంది అర్చకుల వేతనాలు పెంచుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.