తిరుపతి లడ్డూపై ఎందుకింత తాత్సారం..?
చంద్రబాబు పాలన అంతా బక్వాస్
విజయవాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో కొలువు తీరిన నారా చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏం చేశారని 100 రోజుల పాలన గురించి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఆమె మీడియాతో మాట్లాడారు.
ఇచ్చిన ఆరు సిక్స్ గ్యారెంటీలలో ఒక్క సిక్స్ అయినా పూర్తిగా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలకు అమలు చేస్తామని ప్రకటించారని, ఇప్పటి వరకు దాని ఊసే లేదన్నారు.
కొత్త బస్సుల కొనుగోలు పేరుతో కాలయాపన చేస్తున్నారని, చంద్రబాబు పాలన వంద రోజులలో సాధించింది ఏమీ లేదన్నారు. పాలన అంతా గాడి తప్పిందని, తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నం తప్పా మరోటి కాదన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. ప్రజలు వంద రోజుల పాలనకు సున్నా మార్కులు వేస్తున్నారని, అది తెలుసుకుంటే మంచిదని చంద్రబాబు నాయుడుకు సూచన చేశారు ఏపీ పీసీసీ చీఫ్.
తిరుపతి లడ్డూ కల్తీపై ఇంత కాలం ఎందుకు మౌనంగా ఉన్నారో ఏపీ సీఎం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అన్ని వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని దోషులు ఎవరో తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.