చక్రాలపై ఖైదీలుగా మారిన బతుకులు
ఆవేదన వ్యక్తం చేసిన షేక్ సలావుద్దీన్
హైదరాబాద్ – ఐఎఫ్ఏటీ జాతీయ నేత షేక్ సలావుద్దీన్ కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన న్యూఢిల్లీలో జరిగిన యాప్ ఆధారిత కార్మికుల పని , జీవన విధానం గురించి తయారైన నివేదిక గురించి పంచుకున్నారు. ఈ సందర్బంగా సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు.
గత కొన్నేళ్లుగా షేక్ సలావుద్దీన్ యాప్ ఆధారిత కార్మికుల గురించి పోరాడుతూ వస్తున్నారు. వారికి సామాజిక భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఆందోళనలు కూడా చేపట్టారు. తాజాగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ) ఆధ్వర్యంలో కీలక సదస్సు జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను బహిర్గతం చేశారు.
చక్రాలపై ఖైదీలుగా యాప్ ఆధారిత కార్మికులు మారి పోయారంటూ ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని పంచుకున్నారు. న్యూ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన గిగ్ ఎకానమీపై సంచలనాత్మక నివేదికను వెల్లడించారు షేక్ సలావుద్దీన్.
రిపోర్టు రీసెర్చ్ డైరెక్టర్ , పైగామ్ ఫౌండర్ (PAIGAM ) డాక్టర్ అకృతి భాటియా కీలక ఫలితాలను అందించారని తెలిపారు. ఈ అధ్యయనంలో ముఖ్య సలహాదారు సంగం త్రిపాఠి నివేదిక కోసం సిఫార్సులతో అవగాహన కల్పించడం జరిగిందని స్పష్టం చేశారు షేక్ సలావుద్దీన్.
రిపోర్టు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ బిజు మాథ్యూ ముగింపు వ్యాఖ్యలు చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత విశ్రాంత న్యాయమూర్తి ఎ.పి. షా నివేదికను ప్రారంభించారని తెలిపారు. గిగ్ , ప్లాట్ ఫారమ్ పనికి సంబంధించిన మానవీయ కోణాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి చట్టం పరిధిలోకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు షేక్ సలావుద్దీన్.
ప్రముఖ జర్నలిస్టు సంకేత్ ఉపాధ్యాయ ప్యానల్ డిస్కషన్‌ను మోడరేట్ చేశారు. కార్యక్రమం టైటిల్‌ను ప్రస్తావిస్తూ.. ఈ టైటిల్లో ‘ఖైదీలు’ అనే క్వశ్చన్ మార్క్‌ను తొలగించినప్పుడే కార్మికులకు నిజమైన హక్కులు లభిస్తాయని అన్నారు.
రిటైర్డ్ ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ అమూల్యమైన ఆర్థిక అవగాహనను అందించారు, వ్యవస్థాగత మార్పుల తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పారని తెలిపారు. నివేదిక వాస్తవాలను బట్ట బయలు చేసిందని, దీనిని తీవ్రమైన అంశంగా పరిగణించాలని పేర్కొన్నారు.
చట్టంతో పాటు చాలా మంది డ్రైవర్లు, డెలివరీ బాయ్‌ల పట్ల సమాజం సున్నితంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇదొక సర్వీస్ ప్రొవైడింగ్ ఇండస్ట్రీ అని సమాజం కూడా అర్థం చేసుకోవాలని కోరారు. షేక్ సలావుద్దీన్ ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఇప్పటి వరకు వీరికి ఎలాంటి భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం సవాళ్లతో కూడిన జీవితం అత్యంత బాధాకరంగా మారిందని పేర్కొన్నారు. అటు యాజమాన్యాలు ఇటు ప్రభుత్వం సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు షేక్ సలావుద్దీన్.
తాము చేపట్టిన సర్వే డేటా కార్మికుల ఉద్యమానికి ఆయుధంగా ఉపయోగ పడుతుందని స్పష్టం చేశారు. ఈ పారదర్శక డేటా, ఒక సాక్ష్యాధార విలువను కలిగి ఉందని , అవసరమైనప్పుడు విద్యావేత్తలు, పరిశోధకులు, విధాన రూపకర్తలు , న్యాయవాదులతో పంచుకోవచ్చని అన్నారు.
ప్రెసిడెంట్ శీతల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల పరిస్థితి గురించి ప్రస్తావించారు. క్యాబ్‌లో అడుగు పెట్టగానే మహిళలకు సమస్యలు మొదలవుతాయని చెప్పింది. ఇది కాకుండా జర్నలిస్టు అజయ్ తివారీ మాట్లాడుతూ.. గత 20 ఏళ్లలో ఇలాంటి నివేదిక రాలేదన్నారు. పైగామ్ నెట్ వర్క్ తయారు చేసిన ఈ నివేదికను అందరికీ అందుబాటులో ఉంచేలా చూడాలని సూచించారు.
యూపీఐఏఎస్ఐ (UPIASI) వంటి ప్రధాన సంస్థల మద్దతుతో PAIGAM (పీపుల్స్ అసోసియేషన్ ఇన్ గ్రాస్‌రూట్ యాక్షన్ అండ్ మూవ్మెంట్స్) , IFAT (ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-ఆధారిత రవాణా కార్మికుల మధ్య సహకారంతో జరిగిన ఈ అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకునేలా చేసింది.
ఈ నివేదిక గురించి కీలక వ్యాఖ్యలు చేశారు షేక్ సలావుద్దీన్. ప్రపంచంలో ఇప్పటివరకు నిర్వహించబడిన గిగ్ వర్కర్లపై అత్యంత సంచలనాత్మకమైన, సమగ్రమైన అధ్యయనాలలో ఈ నివేదిక ఒకటి అని పేర్కొన్నారు.
యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఇన్స్టిట్యూట్ ఫర్ ది అడ్వాన్స్డ్ స్టడీ ఆఫ్ ఇండియా (UPIASI), అన్నెన్‌బర్గ్ స్కూల్ ఫర్ కమ్యూనికేషన్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా , FES ఇండియా మద్దతుతో ఈ నివేదిక తయారు చేయడం జరిగిందన్నారు షేక్ సలావుద్దీన్.
ఈ నివేదిక భారతదేశంలోని 8 నగరాల్లోని 5302 క్యాబ్ డ్రైవర్లు , 5028 మంది డెలివరీ వ్యక్తులలో దాదాపు 50 ప్రశ్నలతో కూడిన కఠినమైన, విస్తృతమైన , ముఖాముఖి, గ్రౌండ్ సర్వే ఆధారంగా రూపొందించడం జరిగిందని చెప్పారు షేక్ సలావుద్దీన్.
ఢిల్లీ, లక్నో, జైపూర్, ఇండోర్, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ , బెంగళూరు. రైడ్ హెయిలింగ్ క్యాబ్ అగ్రిగేటర్ ద్వారా డ్రైవర్ సంపాదన నుండి అన్యాయమైన , ఏకపక్ష కమీషన్ రేట్లు, తగ్గింపుల సమస్యను పరిశోధించడానికి 3 నగరాల్లో (ఢిల్లీ, జైపూర్ , హైదరాబాద్) 50 మంది డ్రైవర్ల నుండి డేటా పాయింట్లను టీమ్ సేకరించడం జరిగిందని చెప్పారు .
ఈ నివేదిక ప్రాథమిక లక్ష్యం భారతదేశం లోని యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లు , డెలివరీ చేసే వ్యక్తుల పని , జీవన పరిస్థితులను హైలైట్ చేయడం . కార్మికుల ఆర్థిక, సామాజిక, మానసిక , ఆరోగ్య అంశాలపై దృష్టి సారించడం జరుగుతుందని వెల్లడించారు షేక్ సలావుద్దీన్.
గత కొన్ని సంవత్సరాలుగా, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి రంగం పరంగా చెప్పుకోదగ్గ మార్పు వచ్చిందన్నారు. ఇది ‘జిజిఫికేషన్’ ఆవిర్భావం లేదా గిగ్ ఎకానమీ మోడల్‌ను విస్తృతంగా స్వీకరించడం ద్వారా గుర్తించ బడిందన్నారు.