లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా..?
నిప్పులు చెరిగిన ఎన్టీకే పార్టీ చీఫ్ సీమాన్ కామెంట్
తమిళనాడు – నామ్ తమిళర్ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సీమాన్ నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో లడ్డూ తప్ప ఇంక ఏ సమస్యలు లేవా అని ప్రశ్నించారు. కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, కానీ తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందంటూ పెద్ద ఎత్తున చర్చకు వచ్చేలా చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
భక్తుల మనో భావాలను తాము గౌరవిస్తామని, కానీ ఇదే సమయంలో కోట్లాది మంది ప్రజలు , సామాన్యులు, పేదలు ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీమాన్. ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రచారం తప్ప మరోటి కాదన్నారు.
ఇన్నాళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేశారని నిలదీశారు. ప్రజలను ప్రధాన సమస్యల నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడమేనని మండిపడ్డారు సీమాన్. ఇది మంచి పద్దతి కాదన్నారు.
లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా , ఒకవేళ కల్తీ లడ్డూ తిని ఎవరైనా చని పోయారా..అని నిలదీశారు సీమాన్. కల్తీ గనుక జరిగితే చర్యలు తీసుకోవాలని, కానీ లడ్డూ ..బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. తిరుపతి లడ్డూ తిన్న వారంతా బతికే ఉన్నారని, దాని వల్ల ఇబ్బంది అంటూ లేదు కదా అని పేర్కొన్నారు.