గురుకులాల పట్ల ఎందుకింత కక్ష..?
నిప్పులు చెరగిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని గురుకులాలను పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆకాశం అంచును ఒకప్పుడు తాకిన గురుకులాల ఖ్యాతి ఇప్పుడు అధః పాతాళానికి పోయిందని మండిపడ్డారు. దీనికంతటికి ప్రధాన కారకుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఒక బాధ్యత కలిగిన సీఎం స్థాయి వ్యక్తి విద్యా రంగాన్ని పట్టించుకోక పోవడం దారుణమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
విద్యా వెలుగులు పంచిన గురుకులాలు ఇప్పుడు నిరాదరణకు గురవుతున్నాయని, కావాలని కక్ష కట్టారంటూ వాపోయారు. దేశ, రాష్ట్ర స్థాయిలలో ప్రతిభ కనబర్చి, ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఈ గురుకులాల నుంచి వచ్చిన వారేనని, దానిని జీర్ణించు కోలేక ప్రభుత్వం కావాలని వారిని విద్యకు దూరం చేస్తోందని ఆరోపించారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, గత్యంతరం లేక తమ పిల్లలను గురుకులాలలో చదివించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వసతి సౌకర్యాలు కల్పించకుండా నిర్వీర్యం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రపంచ విద్యా విధ్వంసక బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. సంక్షేమ భవన్ లో వందలాది పేరెంట్స్ కూలీ పనులు వదులుకుని తమ బిడ్డల కోసం ధర్నా చేస్తుంటే వారి గురించి పట్టించుకునే సమయం సీఎంకు లేదా అని నిలదీశారు ఆర్ఎస్పీ.